BJP: రాజకీయపార్టీలతోనే కాదు టీఆర్ఎస్ ధన మాఫియాతోనూ పోరాడాం: టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
- కొన్నిచోట్ల ఓటుకు ముప్పై వేల రూపాయలు పంచారు
- అధికార పార్టీ ఎంతగా బరితెగించిందో?
- ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని అక్రమాలమయం చేశారు
ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ అని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్, మజ్లిస్ కలిసి, కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టుల కూటమి ఈ ఎన్నికల్లో పోటీ చేశాయని, బీజేపీ మాత్రమే ఒంటరిగా పోరాడిందని చెప్పారు. నిజానికి ఈసారి తాము పోరాడింది రాజకీయపార్టీలతో మాత్రమే కాదు, అక్రమంగా, అడ్డగోలుగా సంపాదించినటువంటి టీఆర్ఎస్ ధన మాఫియాతో పోరాడామని చెప్పారు.
ఇసుక మాఫియా, మద్యం మాఫియా, కాంట్రాక్టుల మాఫియాతో, అధికారపక్షానికి కొమ్ముకాసే పోలీస్ యంత్రాంగంతోనూ, ఒక్క మాటలో చెప్పాలంటే ‘అధికార అక్రమార్కులు’తో బీజేపీ పోరాటం చేసిందని అన్నారు. ఈ అధికార అక్రమార్కులు వార్డుకు కోటి రూపాయలు చొప్పున ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కొన్నిచోట్ల ఓటుకు ముప్పై వేల రూపాయలు ఇచ్చారంటే, అధికార పార్టీ ఎంతగా బరి తెగించిందో అంటూ ఆరోపణలు చేశారు. కొన్ని వార్డుల్లో అయితే ఓటుకు నోటు ధర ఐదు వేల నుంచి ఇరవైఐదు వేల వరకు పలికిందని విమర్శించారు. ఒకవైపు డబ్బు, మరోవైపు అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని అక్రమాలమయంగా మార్చేశారని ఆరోపించారు.