PCB: మీరు రాకపోతే మేం రాం!... బీసీసీఐని బెదిరిస్తున్న పాక్ క్రికెట్ బోర్డు
- ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియాకప్ టోర్నీ
- టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాక్
- వచ్చే ఏడాది భారత్ లో టీ20 ప్రపంచకప్
రాజకీయ కారణాలతో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ లో పర్యటించని సంగతి తెలిసిందే. పాకిస్థాన్ గడ్డపై టీమిండియా అడుగుపెట్టి 15 ఏళ్లయింది. చివరిసారిగా భారత్ 2005-06 సీజన్ లో పాకిస్థాన్ లో పలు మ్యాచ్ లు ఆడింది. ఉగ్రవాదం ఇరు దేశాల మధ్య ఆగ్రహావేశాలు రగిలించడంతో ఆ ప్రభావం క్రికెట్ పైనా పడింది. దాంతో పాకిస్థాన్ కు భారత క్రికెట్ జట్టును పంపేందుకు బీసీసీఐకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంలేదు. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బెదిరింపులకు దిగింది.
ఈ సెప్టెంబరులో తమ గడ్డపై జరిగే ఆసియా కప్ టోర్నీకి భారత జట్టు రావాల్సిందేనని, లేకపోతే వచ్చే ఏడాది భారత్ లో జరిగే టీ20 ప్రపంచకప్ కు తమ జట్టు రాదని హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈఓ వసీమ్ ఖాన్ వెల్లడించారు. ఆసియా కప్ లో భారత్ పాల్గొనకపోతే తాము టీ20 వరల్డ్ కప్ ను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.
అంతేకాదు, పాకిస్థాన్ లో పర్యటిస్తే ఆసియా కప్ ఆతిథ్య హక్కులు ఇస్తామని బంగ్లాదేశ్ కు ఆఫర్ ఇచ్చినట్టు వస్తున్న వార్తలపైనా వసీమ్ ఖాన్ స్పందించారు. ఆసియా క్రికెట్ మండలి తమకు టోర్నీ ఆతిథ్య హక్కులు ఇచ్చిందని, వాటిని తాము ఎవరికీ బదిలీ చేయబోమని తెలిపారు. తమకు ఆ విధమైన అధికారం కూడా లేదని వెల్లడించారు.