KCR: సీఏఏపై తమ వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించిన సీఎం కేసీఆర్
- తాను కూడా హిందువునేనని కేసీఆర్ వ్యాఖ్యలు
- అవసరమైతే సీఏఏకి వ్యతిరేకంగా 10 లక్షల మందితో సభ నిర్వహిస్తామని వెల్లడి
- కేంద్రం విద్వేషాలు ఎగదోస్తోందని ఆరోపణ
టీఆర్ఎస్ లౌకిక వాద పార్టీ అని, సీఏఏను పార్లమెంటులోనే వ్యతిరేకించామని తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. సీఏఏ నూటికి నూరు శాతం అసంబద్ధ నిర్ణయమని, దేశంలోని అన్ని వర్గాలు సమానమని రాజ్యాంగం చెబుతుంటే, ముస్లింలను పక్కనబెట్టాలని తీసుకున్న నిర్ణయం ఎలా సమంజసం అవుతుందని వ్యాఖ్యానించారు.
హోం మంత్రి అమిత్ షాకు సైతం ఇదే విషయం తెలిపామని వెల్లడించారు. దేశ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఆర్టికల్ 370కి మద్దతు పలికామని, కానీ సీఏఏని వ్యతిరేకించామని స్పష్టం చేశారు. సీఏఏను వ్యతిరేకించే క్రమంలో తప్పదనుకుంటే పది లక్షల మందితో సభ నిర్వహిస్తామని అన్నారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో కేంద్రం చిచ్చుపెడుతోందని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని కేసీఆర్ ఆరోపించారు. తాను కూడా హిందువునేనని, యజ్ఞయాగాదులు బహిరంగంగానే చేస్తానని, కొందరు తలుపులు మూసుకుని యాగాలు చేస్తుంటారని విమర్శించారు.