Congress: సైనికుల్లా పోరాడి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులకు సలాం: పొన్నం ప్రభాకర్
- ఈ ఎన్నికల్లో అనేక ప్రలోభాలతో టీఆర్ఎస్ గెలిచింది
- ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే ఇండిపెండెంట్ లు నెగ్గారు
- మున్సిపాలిటీల్లో అన్ని పన్నులు పెంచబోతున్నారు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సైనికుల్లా పోరాడి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులకు ‘సలాం’ చేస్తున్నానని ఆ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఈ ఎన్నికల్లో అనేక ప్రలోభాలు చూపించి టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేకతతోనే ఇండిపెండెంట్ లు అధిక సంఖ్యలో గెలిచారని, విజయం సాధించిన టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులను తిరిగి పార్టీలోకి తీసుకోమని చెప్పిన కేటీఆర్ ఆ మాటపై నిలబడతారా? అని ప్రశ్నించారు.
వేములవాడ 17వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాకపోవడం తమకు అనుమానంగా ఉందని, దీనిపై విచారణ నిర్వహించాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని పొన్నం చెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఆయన విమర్శలు చేశారు. చట్ట విరుద్ధంగా క్యాంపులు నిర్వహిస్తే ఎన్నికల సంఘం మౌనంగా ఉందని విమర్శించారు. ప్రజాసమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పిన పొన్నం, త్వరలో మున్సిపాలిటీల్లో అన్ని పన్నులు పెంచబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.