Earth Quake: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో భూకంపం!
- నల్గొండ, సూర్యాపేట, కృష్ణా జిల్లాల్లో ప్రకంపనలు
- అర్ధరాత్రి 2.36 గంటల సమయంలో ఘటన
- బయటకు పరుగులు తీసిన ప్రజలు
కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఈ అర్ధరాత్రి భూ ప్రకంపనలు నమోదు కావడం తీవ్ర కలకలం రేపింది. నదికి అటూ ఇటూ ఉన్న నల్గొండ, సూర్యాపేట, కృష్ణా జిల్లాల్లో భూమి కంపించింది. అర్థరాత్రి 2.36 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయి. కోదాడ సమీపంలోని చిలుకూరు, మునగాల, అనంతగిరి, నడిగూడెం తదితర ప్రాంతాల్లో, కృష్ణా జిల్లా జగ్గయ్య పేట మండలం ముత్యాల, రావిరాల, చందర్లపాడు, నందిగామ, గుడిమెట్ల, లక్ష్మీపురం గ్రామాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.
సుమారు ఆరు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు, వంటపాత్రలు కదిలాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లవార్లూ తిరిగి ఇళ్లలోకి వెళ్లకుండా బిక్కుబిక్కుమంటూ, చలిలో వణుకుతూ ఉండిపోయారు. కాగా, సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే గణతంత్ర దినోత్సవం రోజున ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయన్న సంగతిని ప్రజలు గుర్తు చేసుకున్నారు.