Adilabad District: ఈ సంవత్సరం 69 మంది కొత్త కోడళ్లు... మొదలైన నాగోబా జాతర... కనిపించిన నాగుపాము!
- ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో నాగోబా జాతర
- సంప్రదాయ పూజలతో మొదలు
- పాము కనిపించడంతో మెస్రం వంశీయుల ఆనందం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో జరిగే ప్రతిష్ఠాత్మక నాగోబా జాతర మహాపూజతో మొదలైంది. ఈ సంవత్సరం మెస్రం వంశస్తులను వివాహం చేసుకున్న 69 మంది కొత్త కోడళ్లు, తెల్లని వస్త్రాలు ధరించి వచ్చి, నిన్న ప్రత్యేక పూజల అనంతరం నాగోబా దర్శనం చేసుకున్నారు. ఇదే సమయంలో ఆలయానికి సమీపంలోనే ఉన్న విశ్రాంతి గృహం బండరాళ్లపై నాగుపాము కనిపించడంతో భక్తులు హర్షధ్వానాలు చేశారు.
ప్రతి జాతర ముందూ కొత్త కోడళ్లను ఆలయానికి తీసుకుని వచ్చి 'బేటింగ్' అనే ప్రక్రియ నిర్వహించి, ఆపై వారికి నాగోబా దర్శనం కల్పించిన తరువాత జాతర మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో నాగుపాము కూడా కనిపించడంతో ఈ సంవత్సరం దేవుడు తమను ఆశీర్వదించాడని మెస్రం వంశస్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.