Kurnool District: మార్చి నాటికి కర్నూలు ఎయిర్ పోర్టు రెడీ!
- రెండు నెలల్లో పనులు పూర్తి
- నిధులను అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వమే
- ఎయిర్ పోర్టు సిటీని కూడా అభివృద్ధి చేస్తాం
- స్పెషల్ సీఎస్ కరికాల వల్లవన్
కర్నూలు విమానాశ్రయం పనులు మరో రెండు నెలల్లో పూర్తవుతాయని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వల్లవన్ వ్యాఖ్యానించారు. ఓర్వకల్లు సమీపంలోని ఎయిర్ పోర్టును ఏవీయేషన్ డైరెక్టర్ అడ్వయిజర్ భరత్ రెడ్డితో కలిసి సందర్శించిన ఆయన, ఆపై పనులు కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఆపై మీడియాతో మాట్లాడిన ఆయన, సీఎం జగన్ ఆదేశాల మేరకు విమానాశ్రయాన్ని పరిశీలించామని అన్నారు. ఇప్పటివరకూ 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులన్నింటినీ రెండు నెలల్లో పూర్తి చేసి, విమానాల రాకపోకలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నామని, దీంతో నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని వల్లవన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని, ఇక్కడ ఓ ఇండస్ట్రియల్ హబ్, ఎయిర్ పోర్టు సిటీని కూడా అభివృద్ధి చేయాలన్నది సీఎం అభిమతమని అన్నారు. త్వరలోనే ఏవియేషన్ అకాడమీని, పైలట్ సెంటర్ ను ప్రారంభించి, శిక్షణా తరగతులు ప్రారంభిస్తామని అన్నారు. వల్లవన్ వెంట ఎయిర్ పోర్టు సీఈవో నినాశర్మ, ఏపీడీ కైలాష్ మండల్ తదితరులు ఉన్నారు.