New Delhi: ఢిల్లీలో మొదలైన రిపబ్లిక్ వేడుకలు... ఎన్నో స్పెషల్స్!
- వార్ మెమోరియల్ వద్ద మోదీ నివాళులు
- తొలిసారి ప్రజల ముందుకు ఏ శాట్ మిసైల్
- కనువిందు చేసిన కళాబృందాలు
దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో 71వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి`. ఈ సంవత్సరం వేడుకలు ఎన్నో ప్రత్యేకతలతో కూడుకుని ఉండటం గమనార్హం. ప్రతి సంవత్సరమూ వేడుకలకు ముందు ప్రధాని అమర్ జవాన్ జ్యోతి వద్ద దేశ రక్షణకై ప్రాణాలను కోల్పోయిన సైనికులకు నివాళులు అర్పిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం నుంచి అమర్ జవాన్ జ్యోతి వద్ద కాకుండా, నూతనంగా నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు జాతీయ యుద్ధ స్మారకస్థూపం వద్దకు వచ్చిన ఆయన, నివాళులు అర్పించారు. ఆపై 21 తుపాకులను పేల్చిన సైనికులు, వారి సేవలను గుర్తు చేసుకున్నారు.
ఇక ఈ వేడుకలకు తొలిసారిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో ముఖ్య అతిథిగా వచ్చారు. 90 నిమిషాల పాటు సాగనున్న రిపబ్లిక్ వేడుకల్లో పలు రాష్ట్రాలకు చెందిన శకటాలు కనువిందు చేయనున్నాయి. మొత్తం 22 శకటాలకు ఈ సంవత్సరం అనుమతి లభించింది. రిపబ్లిక్ పరేడ్ లో తొలిసారిగా యాంటీ శాటిలైట్ మిసైల్ (ఏశాట్)ను భారత్ తొలిసారిగా ప్రదర్శించింది. మార్చి 27న ఈ శాటిలైట్ ను ప్రయోగించిన శాస్త్రవేత్తలు, విజయం సాధించిన సంగతి తెలిసిందే. 10 సెంటీమీటర్ల యాక్యురసీతో ఈ శాటిలైట్ లక్ష్యాన్ని తాకడం గమనార్హం.
ఇక ప్రత్యేక సైనిక దళాలు, డాగ్ స్క్వాడ్, సాహస బాలలు, పలు రాష్ట్రాలకు చెందిన కళా బృందాలు ఈ పరేడ్ కు హాజరైన ప్రజలను కనువిందు చేశాయి.