at home: హైదరాబాద్ రాజ్‌భవన్ ప్రాంతంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
- సాయంత్రం 5 గంటలకు ‘ఎట్ హోం’ కార్యక్రమం
- సాయంత్రం 4 నుంచి రాత్రి 7.30 గంటల వరకు అమలు
- మోనప్ప ఐలాండ్ నుంచి వీవీ విగ్రహం జంక్షన్ వరకు రాకపోకల బంద్
హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ‘ఎట్ హోం’ కార్యక్రమం ఉండడంతో పోలీసులు ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. వీవీఐపీల రాకను దృష్టిలో పెట్టుకుని మోనప్ప ఐలాండ్ నుంచి వీవీ విగ్రహం జంక్షన్ వరకు సాధారణ వాహనాల రాకపోకలను అనుమతించరు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రాజ్‌భవన్‌కు వచ్చే వారికి ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించారు.
పింక్ పాస్‌లు ఉన్న వారిని ఒకటో నంబరు గేట్ నుంచి వెళ్లి రాజ్‌భవన్ పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలపాలి. తెల్లపాసులు ఉన్న వారు మూడో నంబరు గేట్ నుంచి ప్రవేశించి ఎంఎంటీఎస్, పార్క్ హోటల్, కత్రియాలేన్, జయాగార్డెన్ ఫంక్షన్ హాల్, వీవీ విగ్రహం నుంచి లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ వరకు, మెట్రో రెసిడెన్సీ నుంచి ఎన్ఏఎస్ఆర్ పాఠశాల వరకు ఉన్న రోడ్డులో ఓ వైపు మాత్రమే వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుంది.
మీడియా వాహనాలకు దిల్కుషా గెస్ట్‌హౌస్ ప్రాంతాన్ని కేటాయించారు. ఆంక్షలను వాహన చోదకులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు కోరారు.