TRS: నిజామాబాద్ మేయర్ పీఠం ఉత్కంఠపై స్పష్టతనిచ్చిన ఎంపీ అర్వింద్
- మేయర్ స్థానానికి కావాల్సిన బలం మా వద్ద ఉంది
- కానీ ఎక్స్ అఫిషియో ఓట్లతో టీఆర్ఎస్ సంఖ్య పెరుగుతుంది
- మా సభ్యులు మాత్రం టీఆర్ఎస్కు మద్దతు తెలిపే అవకాశం లేదు
నిజామాబాద్ కార్పొరేషన్లో ఓటర్లు ఈ సారి ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత ఇవ్వకపోవడంతో మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మొత్తం 60 డివిజన్లు ఉండగా బీజేపీ 28, ఎంఐఎం 16, టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 2 గెలుపొంది, మరో డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అయితే, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్ పీఠాన్ని సాధించే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఇప్పటికే మంచి స్నేహం ఉంది. దీంతో ఆయా పార్టీ నేతలకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కే అవకాశం ఉంది. మేయర్ కోసం 31 మంది బలం కావాలి. ఎంఐఎం, టీఆర్ఎస్ కలిస్తే వారి బలం 29 అవుతుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేస్తారు.
నిజామాబాద్ మేయర్ పీఠం ఉత్కంఠపై ఎంపీ అర్వింద్ స్పందించి, తమ పార్టీ వైఖరిపై స్పష్టతనిచ్చారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేయర్ స్థానానికి కావాల్సిన బలం తమ వద్ద ఉందని చెప్పుకొచ్చారు. కానీ, ఎక్స్ అఫిషియో ఓట్లతో టీఆర్ఎస్ సంఖ్య పెరుగుతుందని దీంతో తమ పార్టీకి మేయర్ పీఠం దక్కే అవకాశం అనుమానమని అన్నారు. తమ సభ్యులు మాత్రం టీఆర్ఎస్కు మద్దతు తెలిపే అవకాశం లేదని ఆయన చెప్పారు.