YSRCP: టీడీపీ ఎమ్మెల్సీలను కొనుగోలు చేయాల్సిన అవసరం మాకు లేదు: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి
- మండలి మా చేతిలో ఉందన్న టీడీపీ వ్యాఖ్యలు నమ్మొద్దు
- చైర్మన్ ను బాబు తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు
- మండలి గ్యాలరీలో చంద్రబాబు కూర్చోవడం దారుణం
ఏపీ శాసనమండలి తమ చేతిలో ఉందని, తాము ఏదైనా చేస్తామనే భ్రమను ప్రజల్లో టీడీపీ కల్పిస్తోందని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాసనమండలి చైర్మన్ షరీఫ్ ను చంద్రబాబు ప్రభావితం చేసి తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఆరోపించారు. మండలి గ్యాలరీలో కూర్చుని ఓ కార్యకర్త కంటే హీనంగా చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు. మండలి రద్దును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో ఇటీవల చర్చ జరిగిందని, కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని వర్గాల సలహాలు తీసుకుంటే మంచిదని భావించి సమయం ఇచ్చామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్సీలను కొనుగోలు చేసి తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నామన్న ఆరోపణలపై సజ్జల స్పందిస్తూ, ఆ అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.