Mahesh Babu: రిపబ్లిక్ డే సందర్భంగా సీఐఎస్ఎఫ్ జవాన్లతో గడిపిన మహేశ్ బాబు
- ఇటీవలే విడుదలై హిట్టయిన సరిలేరు నీకెవ్వరు
- నీసాలో సందడి చేసిన సరిలేరు నీకెవ్వరు యూనిట్
- జవాన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన మహేశ్ బాబు
ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ పాత్ర పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఎంటర్టయినర్ చిత్రం మహేశ్ బాబు కెరీర్ లో చిరస్మరణీయ చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక, రిపబ్లిక్ డే సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రయూనిట్ హైదరాబాదు శివార్లలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నీసా)ని సందర్శించింది. హీరో మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి, సీనియర్ నటి విజయశాంతి అకాడమీలో జవాన్లతో రిపబ్లిక్ డే జరుపుకున్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ, 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో సైనికాధికారి పాత్ర పోషించానని, తొలిసారి ఆర్మీ డ్రెస్ వేసుకోగానే రోమాలు నిక్కబొడుచుకున్నాయని తెలిపారు. సైనికులంటే తనకు ఎనలేని గౌరవం అని పేర్కొన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ఓ సైనికుడి స్ఫూర్తితోనే 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తెరకెక్కిందని వెల్లడించారు. ఓసారి రైలులో ప్రయాణం చేస్తుంటే అస్సలు నిద్రపోని ఓ సైనికుడ్ని చూశానని, ఎందుకు నిద్రపోవడంలేదని అడిగితే, తాము మూడు నాలుగు గంటలకంటే ఎక్కువ నిద్రపోమని, ఇప్పుడు కూడా ఆ అలవాటు తప్పదలుచుకోలేదని ఆ జవాను చెబితే ఆశ్చర్యపోయానని అనిల్ వివరించారు.