AP Legislative Council: మండలిని రద్దు చేస్తే మరో తుగ్లక్ నిర్ణయం అవుతుంది: నారా లోకేశ్
- మండలి రద్దు అంశంపై లోకేశ్ స్పందన
- సీఎం తప్పుల మీద తప్పులు చేస్తున్నారని విమర్శలు
- మండలిని ఎందుకు రద్దు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్
ఏపీలో శాసనమండలిని రద్దు చేస్తున్నట్టు విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారపక్షం మల్లగుల్లాలు పడుతుండగా, విపక్ష టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే విధంగా వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు.
మండలిని రద్దు చేస్తే మరో తుగ్లక్ నిర్ణయం అవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని విమర్శించారు. మండలిని ఎందుకు రద్దు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తన వైఫల్యాలకు మంత్రులను బలిచేసే పని సీఎం ఇప్పటికే మొదలుపెట్టాడని ఆరోపించారు. దావోస్ సదస్సుకు రమ్మని రాష్ట్రానికి ఆహ్వానం లేదని, ఏపీకి వచ్చే పెట్టుబడులను తెలంగాణ తన్నుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.