Corona: రాజస్థాన్ లో 'కరోనా' కలవరం, హైదరాబాద్ లో నలుగురు అనుమానితులు!
- ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా
- ఇటీవలే చైనా నుంచి వచ్చిన వైద్య విద్యార్థి
- వైరస్ లక్షణాలు కనిపించడంతో ఐసొలేషన్ వార్డులో చికిత్స
తొలుత చైనాను, ఆపై అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలనూ గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఆనవాళ్లు ఇప్పుడు ఇండియాలోనూ కనిపించడం కలకలం రేపుతోంది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ అనుమానిత వైరస్ సోకిన వైద్య విద్యార్థిని ఐసొలేషన్ వార్డులో ఉంచారు. ఇతను ఇటీవలే చైనాలో ఎంబీబీఎస్ చదువుకుని తిరిగి వచ్చాడని, అతనిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి రఘు శర్మ వెల్లడించారు. అతనితో పాటు అతని కుటుంబీకుల రక్త నమూనాలను కూడా సేకరించామని, వాటిని పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్ కు పంపించామని చెప్పారు. చైనా నుంచి మొత్తం 18 మంది రాష్ట్రానికి వచ్చి, నాలుగు జిల్లాలకు వెళ్లారని, వారందరి రక్త నమూనాలనూ పరిశీలిస్తామని తెలిపారు.
ఇదిలావుండగా, హైదరాబాద్ కు ఇటీవల చైనా నుంచి వచ్చిన ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆసుపత్రి వైద్యులు అతనిని ప్రత్యేక వార్డులో ఉంచారు. అతని కుటుంబీకుల్లో ముగ్గురిలోనూ ఇవే లక్షణాలు ఉండగా, వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేరళలోని కొచ్చిలోనూ ఓ అనుమానితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ వైరస్ ఇండియాలో వ్యాపించకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చైనా నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేసిన తరువాతే విమానాశ్రయం బయటకు అనుమతిస్తున్నారు. ప్రతి విమానాశ్రయంలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చైనా నుంచి వచ్చే ప్రయాణికులను పరిశీలిస్తోంది.