AP Legislative Council: చకచకా అడుగులు... ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దుకు నేడే ఆమోదం!
- ఆమోదముద్ర వేసిన క్యాబినెట్
- అసెంబ్లీ ఆమోదం పొందిన వెంటనే కేంద్రానికి
- ఆపై అసెంబ్లీ నిరవధిక వాయిదా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ ఉదయం సమావేశమైన జగన్ క్యాబినెట్ మండలి రద్దు నిర్ణయానికి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆపై నేడు అసెంబ్లీలో మండలి రద్దు బిల్లును చర్చకు పెట్టి, ఆ వెంటనే ఆమోదింపజేసుకుని, కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.
మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలుత కొన్ని బిల్లులకు ఆమోదం పొంది, ఆపై మండలి రద్దు బిల్లును చర్చకు పెడతారని సమాచారం. మండలి రద్దు బిల్లుకు ఆమోదం లభించిన తరువాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడనుంది. అయితే, నేటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్న సంగతి తెలిసిందే.