Tulasi Reddy: ఇల్లు అలకగానే పండుగ కాదు, తీర్మానం చేసినంత మాత్రాన మండలి రద్దయిపోదు: తులసిరెడ్డి
- సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అవివేకం
- అందుకు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు
- ఈ సీఎం అవసరమా? అంటూ తులసిరెడ్డి వ్యాఖ్యలు
ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఆయన అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదని, క్యాబినెట్ లో తీర్మానం చేసినంత మాత్రాన మండలి రద్దయిపోదని వ్యాఖ్యానించారు. మండలి రద్దుకు ముఖ్యమంత్రి చెబుతున్న కారణాలు సమంజసంగా లేవని అభిప్రాయపడ్డారు.
"ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చయ్యే శాసనమండలి అవసరమా అంటున్నారు. మరి, రైతులు, మహిళలు, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా హైకోర్టులో వాదించే న్యాయవాదికి రూ. 5 కోట్లు చెల్లించే ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఈ పేద రాష్ట్రానికి అవసరమా అని నేను అడుతున్నా! బీసీజీ కమిటీకి ఓ నివేదిక ఇచ్చేందుకు రూ.5.95 కోట్ల ప్రజాధనాన్ని చెల్లిస్తున్న ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పేద రాష్ట్రానికి అవసరమా అని అడుగుతున్నా! ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసేందుకు రూ.1400 కోట్లు ఖర్చు చేస్తున్న ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఈ పేద రాష్ట్రానికి అవసరమా అని అడుగుతున్నా..!" అంటూ తులసిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.