Janasena: ఈ సభకు పైన మరో సభ ఉండటం ఎంతమాత్రం సమంజసం కాదు!: జనసేన ఎమ్మెల్యే రాపాక
- మండలిపై టీడీపీ దొంగాట ఆడుతోంది
- కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే చంద్రబాబు పని
- బిల్లులను మండలి అడ్డుకోవడం దురదృష్టకరం
శాసన మండలి రద్దు తీర్మానంపై ఏపీ శాసనసభలో జరుగుతున్న చర్చలో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తీర్మానానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై విమర్శలు చేశారు. మండలిపై టీడీపీ దొంగాట ఆడుతోందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే చంద్రబాబు పని అంటూ వ్యాఖ్యానించారు. పాలన వికేంధ్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు.
అభివృద్ధి వికేంద్రీకరణ 13 జిల్లాలకు విస్తరించాలని సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ బిల్లును మండలిలో అడ్డుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అదేవిధంగా, మండలిలో ఆంగ్ల మాధ్యమం బిల్లు, ఎస్సీ,ఎస్టీ కమిషన్ల బిల్లులను అడ్డుకున్నారన్నారు. విడదీసి పాలించడమే చంద్రబాబు నైజమని విమర్శించారు. శాసనసభలో మేధావులు, రాజకీయ ఉద్దండులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులున్నారని సీఎం జగన్ చెప్పారని... ఈ సభకు పైన మరో సభ ఉండటం ఎంతమాత్రం సమంజసం కాదని అన్నారు.