CPI Narayana: మండలి వ్యవస్థకు సీపీఐ వ్యతిరేకం.. అయినా వైసీపీ స్వార్థంతో తీర్మానించడాన్ని ఖండిస్తున్నాం: సీపీఐ నారాయణ
- బలముందని మండలిని రద్దు చేయడం సరికాదు
- 4 నెలలు ఆగితే మండలిలో వైసీపీ బలం పెరిగేది
- బిల్లు ఆమోదం పొందలేదని.. మండలినే రద్దు చేస్తారా?
ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి రద్దుకోసం వైసీపీ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. బలముందని మండలిని రద్దు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిల్లు ఆమోదం పొందలేదన్న కారణంతో ఏకంగా శాసన మండలిని రద్దు చేయడం అనుచిత చర్య అని పేర్కొన్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. శాసన మండలి వ్యవస్థకు సీపీఐ వ్యతిరేకమని, అయితే, స్వార్థ ప్రయోజనాలకోసం వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జగన్ నిర్ణయాలతో వ్యవస్థలకు నష్టం వాటిల్లుతోందన్నారు. నాలుగు నెలలు ఆగితే మండలిలో వైసీపీ బలం పెరిగేదన్నారు.