Rahul Gandhi: యూపీ పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ ఎన్ హెచ్ ఆర్సీకి ఆధారాలు సమర్పించిన రాహుల్, ప్రియాంక
- సీఏఏకి వ్యతిరేకంగా యూపీలో తీవ్ర ఆందోళనలు
- నిరసనకారులపై పోలీసులు దాడులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఆగ్రహం
- విచారణ జరిపించాలని ఎన్ హెచ్ ఆర్సీని కోరిన రాహుల్, ప్రియాంక
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు. అయితే, నిరసనకారులపై యూపీ పోలీసులు కిరాతకంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) సభ్యులను కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసుల దౌర్జన్యం కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, పోలీసుల దమనకాండకు ఆధారాలను కూడా కమిషన్ కు సమర్పించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.