YSRCP: ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని ఈరోజు శాసనసభలో తీసుకున్నాం: వైసీపీ ఎమ్మెల్యే అంబటి
- మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా అంగీకరించింది
- గతంలో కూడా మండలిని రద్దు చేశారు
- కాలానుగుణంగా అభిప్రాయాలు మారుతున్నాయి
ఓ చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ఈ రోజు శాసనసభలో తీసుకోవడం జరిగిందని, శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా అంగీకరించిందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. మండలి రద్దు తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం లభించిన అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
అనంతరం, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అంబటి మాట్లాడుతూ, శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభకు హాజరైన 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందిందని చెప్పారు.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ హయాంలో శాసనమండలిని అప్పటి సీఎం నందమూరి తారకరామారావు రద్దు చేశారని, ఆ తర్వాత సీఎం అయిన వైఎస్ రాశేఖర్ రెడ్డి మండలిని పునరుద్ధరించారని గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం జగన్ హయాంలో మండలిని తీసేస్తున్నారని, ఈ పరిణామాలను పరిశీలిస్తే కాలానుగుణంగా అభిప్రాయాలు మారుతున్నాయని అన్నారు.