Revanth Reddy: ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై రేవంత్ రెడ్డి స్పందన ఇదీ!
- జగన్ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
- నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు
- కేసీఆర్తో స్నేహం వల్లే ఇదంతా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానంపై తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి స్పందించారు. పెద్దల సభ రద్దు సరైనది కాదని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఏపీ పరిణామాలు చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదం పొందలేదన్న కారణంతో సభను రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్ని రాజధానులు ఉండాలన్నది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమేనని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో స్నేహం వల్లే జగన్కు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయన్న అనుమానం వస్తోందన్నారు. కేసీఆర్తో స్నేహం జగన్కు అంత మంచిది కాదన్నారు. తనను నమ్మిన అందరినీ కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. నేతలకు పట్టుదల ఉండడం మంచిదే కానీ, మొండితనం మంచిది కాదని రేవంత్రెడ్డి హితవు పలికారు.