AP Legislative Council: మండలి రద్దు ఒక్క రోజులో తేలే వ్యవహారం కాదు: జంధ్యాల రవిశంకర్
- అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు
- రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చే వరకు మండలి కొనసాగాల్సిందే
- రాష్ట్రపతి గెజిట్ విడుదలయ్యాకే పూర్తిస్థాయిలో రద్దు
శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానంపై అసెంబ్లీ మాజీ న్యాయ సలహాదారు జంధ్యాల రవిశంకర్ స్పందించారు. ఈ వ్యవహారం ఇప్పట్లో తేలడం కష్టమని, అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చే వరకు మండలి కొనసాగుతుందన్నారు. ఏపీ శాసనసభ చేసిన తీర్మానంపై ఏడాదిలోపు చర్చ జరిగే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.
2013 నుంచి 2019 మధ్య ఇలాంటి బిల్లులు ఐదు వచ్చాయని, అవన్నీ పెండింగులోనే ఉన్నాయని తెలిపారు. 1970లో ఉత్తరప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానం 1980కి కూడా ఆమోదం పొందలేదని గుర్తు చేశారు. దీంతో మండలిని కొనసాగించక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రపతి నుంచి గెజిట్ విడుదలైన తర్వాతే పూర్తిస్థాయిలో మండలి రద్దు అవుతుందని రవిశంకర్ వివరించారు.
సెలక్ట్ కమిటీకి బిల్లు వెళ్లడమంటే ప్రజాభిప్రాయ సేకరణకు పంపడమేనని ఆయన పేర్కొన్నారు. సెలక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వకపోతే చైర్మన్ స్వయంగా కొందరిని నియమించుకునే అధికారం ఉందన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనూ శాసనసభలానే మండలి కూడా యథావిధిగా సమావేశం కావాల్సి ఉంటుందని రవిశంకర్ వివరించారు.