Rajya Sabha: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు నిర్ణయం సరికాదు: ఎంపీ కె.కేశవరావు

  • ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తప్పు ఓటు వేశాననడం సబబు కాదు
  • కేవీపీ రామచంద్రరావుకు ఓటు హక్కు కల్పించడంపై అభ్యంతరం
  • పరస్పరం రాష్ట్రాలు మార్చుకుంటూ నేను, కేవీపీ లేఖలు ఇచ్చాం 

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు నిర్ణయం సరికాదని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. మండలి రద్దుపై అసెంబ్లీలో చేసిన తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం జగన్ అన్న వ్యాఖ్యలను కేకే తప్పుబట్టారు. మండలిపై రూపాయి ఖర్చయినా దండగేనంటూ జగన్ అనడం అనాలోచిత వ్యాఖ్యంటూ.. అది నాన్సెన్స్ అని పేర్కొన్నారు.

ఈ రోజు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీర్మానాలను కేంద్రం అమలు చేస్తుందన్నారు. అవసరమైతే వీటి అమలుకోసం ఎక్కువ సమయం తీసుకోవచ్చన్నారు.

ఇక తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటేసిన తనపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. నేరేడుచర్లలో కేవీపీ రామచంద్రరావుకు ఓటు హక్కు కల్పించడంపై కేకే అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను తప్పు ఓటు వేశాననడం సబబు కాదన్నారు. వాస్తవాలన్నింటినీ ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

పరస్పరం రాష్ట్రాలు మార్చుకుంటూ నేను, కేవీపీ లేఖలు ఇచ్చామని.. అప్పటి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదేశాలు కూడా ఇవ్వడమేకాక, 2014లో గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారన్నారు. ‘కేవీపీకి తెలంగాణలో సాధారణ ఓటు హక్కు కూడా లేదు. ఇద్దరికీ ఇక్కడ ఓటుహక్కు ఇవ్వడం సరికాదు. నేనెలాగూ ఓటు వేశాను. కేవీపీకి ఓటు హక్కు ఇస్తారో లేదో ఎస్ఈసీ చూసుకోవాలి. తప్పు జరిగిందన్నది నేనెలా చెబుతాను?’ అని కేకే అన్నారు.

  • Loading...

More Telugu News