Maharashtra: మహారాష్ట్రలో బావిలో పడిన బస్సు.. 20 మంది దుర్మరణం
- బస్సు టైరు పేలడమే దుర్ఘటనకు కారణం
- ఆటోను ఢీకొట్టి బావిలోకి దూసుకెళ్లిన బస్సు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాసిక్‌లోని దియోలా ప్రాంతంలో జరిగిందీ దుర్ఘటన. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టి అదే వేగంతో వెళ్లి బావిలో పడింది. టైరు పేలిపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. బస్సు బావిలో పడడంతో అందులోని ప్రయాణికులు తప్పించుకునే వీలు లేక జలసమాధి అయ్యారు.
మృతుల్లో ఆటో, బస్సు ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.