Tirumala: తిరుమలలో నాలుగు కంపార్టుమెంట్లలోనే భక్తులు!
- దర్శనానికి 5 గంటల సమయం
- నిన్న రూ. 2.90 కోట్ల హుండీ ఆదాయం
- స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
తిరుమలలో ఈ ఉదయం రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి స్వామి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల వ్యవధిలో కలుగుతుందని అధికారులు వెల్లడించారు.
టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన వారికి, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం పూర్తవుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 70 వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా, రూ. 2.90 కోట్ల ఆదాయం హుండీ ద్వారా లభించింది. కాగా, ఈ ఉదయం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి, ప్రాంతీయ అసమానతలను సృష్టించడం మంచిది కాదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి జిల్లా ప్రజలు తమ ప్రాంత అభివృద్ధినే కోరుకుంటారని చెప్పారు.