Crime News: డాక్టర్‌నని చెప్పి మోసం చేశాడు...ఇప్పుడు కట్నం కోసం వేధిస్తున్నాడు!: మహిళ ఆరోపణ
- అత్తారింటి ముందు బిడ్డతో పాటు నిరసన
- న్యాయం చేయాలంటూ వేడుకోలు
- ఇప్పటికే వనస్థలిపురం స్టేషన్లో ఫిర్యాదు
డాక్టర్‌నని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు అదనపు కట్నం కోసం శారీరకంగా మానసికంగా తన భర్త వేధిస్తున్నాడని ఓ మహిళ అత్తవారింటి ముందు బిడ్డతోపాటు దీక్షకు కూర్చుంది.
బాధితురాలి కథనం మేరకు...హైదరాబాద్ వనస్థలిపురం సహారా ఎస్టేట్‌కు చెందిన ఉదయ్‌కుమార్, మౌనిక దంపతులు. వీరికి ఇటీవలే ఓ ఆడపిల్ల పుట్టింది. ఉదయ్‌కుమార్ డాక్టర్‌నని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నిజం తెలిసి షాకైన మౌనిక చేసేదిలేక ఊరుకుంది. గర్భం దాల్చాక పుట్టింటికి వెళ్లింది. ఆడపిల్ల పుట్టాక అత్తవారింటికి వస్తే పొమ్మంటూ, ఆమె దుస్తులు బయట పారేసి వెళ్లగొట్టారు. దీంతో ఆమె బిడ్డతోపాటు అత్తారింటి ముందు దీక్షకు కూర్చుంది.
‘పెళ్లయిన పదిహేను రోజుల నుంచే భర్త, అత్తమామలు, మరిది వేధించడం మొదలుపెట్టారు. కుటుంబ పరువును దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేదు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందని ఇంటిలోనుంచే గెంటేశారు. అదనపు కట్నం తెస్తేనే అడుగు పెట్టనిస్తామని తెగేసి చెబుతున్నారు.
ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులే నాకు న్యాయం చేయాలి. నా భర్త కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుని అతను నాతోనే ఉండేలా చేయాలని కోరుతున్నాను’ అంటూ మీడియా ప్రతినిధుల ముందు మౌనిక వాపోయింది.