Galla Jayadev: జీఎన్ రావు కమిటీ నివేదికను ప్రజలకు వెల్లడించనిది ఇందుకేనా..?: గల్లా జయదేవ్
- కమిటీల నివేదికలపై పత్రికల్లో కథనాలు
- నిపుణుల కమిటీ స్పష్టంగా పేర్కొంది
- నివేదికల్లోని అంశాలను ఉటంకిస్తూ ప్రభుత్వంపై విమర్శలు
విశాఖ నగరానికి తుపానుల ముప్పు ఉందని జీఎన్ రావు, బీసీజీ కమిటీ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. విశాఖకు తీవ్రస్థాయిలో తుపానుల నుంచి ముప్పు, వరదలు, సముద్రపు నీటి మట్టం పెరుగుదల, పారిశ్రామిక కాలుష్యం, భూగర్భజలాలు కలుషితం, ఈస్ట్రన్ నావల్ కమాండ్ ఉండడంతో భద్రతాపరమైన ముప్పు ఉన్నట్టు జీఎన్ రావు కమిటీ నివేదికలో పేర్కొన్నారని, జీఎన్ రావు కమిటీని ప్రజలకు వెల్లడించనిది ఇవన్నీ ఉండడం వల్లేనా..? అంటూ జయదేవ్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.
అంతేగాకుండా, ఇక్కడ కొత్తగా ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ వాంఛనీయం కాదని, అభివృద్ధి కోణంలో విశాఖకు ఆ అవసరమే లేదని కమిటీ పేర్కొందని గల్లా వివరించారు. నిపుణుల కమిటీ ఇంత స్పష్టంగా సిఫారసులు చేస్తే, వాటిని పట్టించుకోకుండా వైజాగ్ కు రాజధాని తరలించాల్సిందేనని ఎందుకు గట్టిగా ప్రయత్నిస్తోందని నిలదీశారు.