Kane Williamson: ప్చ్.. మాకు సూపర్ ఓవర్లు ఏమాత్రం కలిసిరావడం లేదు: కేన్ విలియమ్సన్
- హామిల్టన్ టి20లో టీమిండియా విజయం
- సూపర్ ఓవర్ లో ఓడిన న్యూజిలాండ్
- ఇటీవలే వరల్డ్ కప్ ఫైనల్లోనూ సూపర్ ఓవర్ ఆడినా దక్కని ఫలితం
హామిల్టన్ లో జరిగిన థ్రిల్లింగ్ టి20 మ్యాచ్ లో టీమిండియా చేతిలో ఓటమిపాలవడం పట్ల న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ విచారం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ లో స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ లో కివీస్ 17 పరుగులు చేయగా, రోహిత్ శర్మ సిక్సర్ల మోతతో టీమిండియా చివరికి బంతికి విజయం సాధించింది. దీనిపై కేన్ విలియమ్సన్ స్పందిస్తూ, తమకు సూపర్ ఓవర్లు అచ్చిరావడంలేదని వాపోయాడు. ఇకమీదట సూపర్ ఓవర్ వరకు తెచ్చుకోకుండా రెగ్యులర్ ఇన్నింగ్స్ లో మరింత మెరుగ్గా ఆడడంపైనే దృష్టి పెడతామని తెలిపాడు.
ఎంతో శ్రమించిన తర్వాత కూడా ఓటమిపాలవడం చాలా బాధిస్తోందని అన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో ఇరుజట్ల స్కోర్ల మధ్య అంతరం స్వల్పమేనని గ్రహించాలని విలియమ్సన్ పేర్కొన్నాడు. భారత జట్టు తనకున్న అపార అనుభవంతో ఒత్తిడిని అధిగమించిందని, తాము కూడా వారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
కివీస్ జట్టు సూపర్ ఓవర్ లో ఓడిపోవడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లోనూ సూపర్ ఓవర్ ఆడినా వ్యతిరేక ఫలితమే వచ్చింది. ఆ మ్యాచ్ లో సూపర్ ఓవర్ కూడా టై కావడంతో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 7 సార్లు సూపర్ ఓవర్ ఆడిన కివీస్ జట్టు 6 పర్యాయాలు ఓటమి చవిచూసింది.