Women: మసీదుల్లో ప్రార్థనలకు మహిళలను ఇస్లాం అనుమతిస్తుంది: ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు
- సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో వెల్లడి
- పురుషులు తప్పనిసరిగా శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొనాలి
- మహిళలకు తప్పనిసరి కాదు
మసీదుల్లో మహిళల ప్రార్థనలను నిరోధిస్తూ ఇస్లాంలో ఎలాంటి నిబంధన లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. మసీదుల్లో మహిళలను కూడా ప్రార్థనలకు అనుమతించాలంటూ మహారాష్ట్రకు చెందిన ఓ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. వివరణ ఇవ్వాలంటూ ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈరోజు కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
మసీదుల్లో మహిళలు ప్రార్థనలు చేసుకోవడాన్ని ఇస్లాం అనుమతిస్తుందని పేర్కొంటూ.. ఈ విషయంలో జారీ అయిన ఫత్వాలను పట్టించుకోవద్దని సదరు పిటిషన్ దారులను ముస్లిం లా బోర్డు కోరింది. మహిళలు స్వేచ్ఛగా మసీదుల్లో ప్రార్థనలకు హాజరు కావచ్చంటూ ముస్లిం లా బోర్డు తన అఫిడవిట్ లో పేర్కొంది. ప్రతీ శుక్రవారం జరిగే సామూహిక ప్రార్థనల్లో పురుషులు తప్పనిసరిగా పాల్గొనాలని ఇస్లాం చెబుతోందని.. అయితే మహిళలకు ఇది తప్పని సరి కాదని బోర్డు స్పష్టం చేసింది.