Virat Kohli: ఒక దశలో ఓడిపోతున్నామని ముందే కోచ్ కు చెప్పేసిన కోహ్లీ!
- నిన్న హామిల్టన్ లో న్యూజిలాండ్ తో మ్యాచ్
- విలియమ్సన్ విజృంభణ చూసి ఓడిపోతామనుకున్న కోహ్లీ
- రోహిత్, షమీల మ్యాజిక్ గెలిపించిందని వ్యాఖ్య
నిన్న హామిల్టన్ లో న్యూజిలాండ్ తో సూపర్ ఓవర్ వరకూ జరిగిన మ్యాచ్ ని భారత క్రికెట్ జట్టు, అనూహ్యంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ విధ్వంసక బ్యాటింగ్ ను చూసిన ఎవరైనా, విజయానికి న్యూజిలాండ్ జట్టు అర్హమైనదనే ఒప్పుకోవాలి. ప్రతి బంతికి సగటున రెండు పరుగుల చొప్పున రన్స్ చేస్తూ వెళ్లిన విలియమ్సన్ 95 పరుగులు సాధించాడు.
ఒక దశలో మ్యాచ్ లో ఓడిపోక తప్పదని భావించిన కోహ్లీ, అదే విషయాన్ని కోచ్ కి చెప్పాడట. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం కోహ్లీ, మీడియా సమావేశంలో గుర్తు చేసుకున్నాడు. ఓ దశలో మ్యాచ్ తమ చేతి నుంచి జారిపోయిందని, అయితే, కీలక సమయంలో అతను అవుట్ కావడం, ఆ వెంటనే షమీ బంతితో మ్యాజిక్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగిందని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
ఇక సూపర్ ఓవర్ లోనూ విలియమ్సన్ విజృంభించడంతో తాము ఒత్తిడిలోకి వెళ్లామని, అయితే, రోహిత్ శర్మ తన బ్యాటుతో జట్టును గెలిపించాడని కితాబిచ్చాడు. ఇక ఈ సీరీస్ ను 5-0 తేడాతో గెలిచేందుకు ప్రయత్నిస్తామని, ఇప్పటివరకూ న్యూజిలాండ్ లో ఆడని సైనీ, సుందర్ తదితరులకు అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు.