Indian Navy: వలపు వల విసిరి... డబ్బు ఆశ చూపి.. నేవీ ఉద్యోగులను బుట్టలో వేసుకుంటున్న పాక్ గూఢచార సంస్థ!
- నేవీ ఉద్యోగులపై ఐఎస్ఐ వలపువల
- తప్పు చేస్తున్నామని తెలిసీ లొంగిన ఉద్యోగులు
- ఇప్పటివరకూ 13 మంది అరెస్ట్
పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ విసిరిన వలపు వలలో చిక్కుకుని వారికి భారత భద్రతా రహస్యాలను చేరవేసిన నేవీ ఉద్యోగుల కేసులో ఎన్ఐఏ మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. నేవీ ఉద్యోగుల వేతన ఖాతాలతో పాటు, వారి సన్నిహితులు, బంధువుల ఖాతాల్లో పెద్ద ఎత్తున పాకిస్థాన్ డబ్బులను జమ చేసిందని తేల్చారు. ముంబయి కేంద్రంగా హవాలా వ్యాపారం నడిపిస్తున్న ఇండియాజ్ సయ్యద్, షేస్ సాహిస్థాలు, పాక్ నుంచి వచ్చే డబ్బును ఉద్యోగుల ఖాతాల్లోకి చేర్చారని అధికారులు తేల్చారు.
తాము చేస్తున్నది తప్పని, ఉగ్రదాడులకు సన్నాహకాలు జరుగుతుంటే, వాటిల్లో తాము కూడా భాగస్వాములం అవుతున్నామని ఉద్యోగులకు తెలుసునని అధికారులు అంటున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ పలువురు ఉద్యోగులను కస్టడీలోకి తీసుకుని విచారించగా, వారంతా తమ తప్పును అంగీకరించారని తెలుస్తోంది.
ఇక నిందితులంతా, తమకు పరిచయం అయిన అందమైన అమ్మాయిలపై మోజుతో, ఫేస్ బుక్, ఈ-మెయిల్ మాధ్యమంగా వారితో మాట్లాడారని, వారికి దేశ రహస్యాలు చేరవేశారని ఎన్ఐఏ గుర్తించింది. ఇక ఎటువంటి సమాచారాన్ని పాక్ కు ఉద్యోగులు చేరవేశారన్న అంశంపై అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.
ఇప్పటివరకూ ఈ కేసులో 13 మందిని నిందితులుగా ఎన్ఐఏ అరెస్ట్ చేయగా, వీరిలో 11 మంది నేవీ ఉద్యోగులు, ఇద్దరు హవాలా ఆపరేటర్లు ఉన్నారు. వీరంతా 25 సంవత్సరాల వయసులోపున్న వారే కావడం గమనార్హం. వీరంతా వాట్స్ యాప్ ద్వారా యుద్ధ నౌకలు, సబ్ మెరైన్ల కదలికలను ఐఎస్ఐకి పంపారని, నేవీ స్థావరాల చిత్రాలు, వీడియోలను కూడా పంపారని అధికారులు తేల్చారు.