CoronaVirus: కరోనా సోకితే 28 రోజుల్లో మృతి... చైనాలో ఒక్కరోజులో 1500కు పైగా పెరిగిన కేసులు!
- తొలుత జలుబుతో మొదలయ్యే వ్యాధి
- ఆపై దగ్గు, జ్వరం లక్షణాలు
- కిడ్నీలను పాడుచేసే కరోనా వైరస్
చైనాలోని వూహాన్ నగరంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ సోకితే, 28 రోజుల్లోగా మరణిస్తారని, తొలి దశలోనే గుర్తించి తగిన చికిత్స చేయించుకుంటే ప్రాణాలను నిలుపుకోవచ్చని వైద్యులు హెచ్చరించారు. ఈ వ్యాధి సోకిన వారికి తొలుత జలుబు లక్షణాలు కనిపిస్తాయని, ఆపై నాలుగు రోజులకు దగ్గు, జ్వరం వస్తాయని వైద్యులు అంటున్నారు.
ఆపై వారం రోజుల తరువాత పరిస్థితి విషమిస్తుందని, కిడ్నీలు విఫలమవుతాయని, దీంతో తీవ్ర అనారోగ్యంతో ఎప్పుడైనా మరణం సంభవించవచ్చని హెచ్చరించారు. వైరస్ సోకిన తరువాత, సరైన చికిత్స లభించకుంటే, సగటున నెల రోజుల్లోనే మరణిస్తారని, వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారి జీవితకాలం మరో మూడు వారాల వరకూ పెరగవచ్చని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.
కాగా, బుధవారం వరకూ చైనాలో దాదాపు 6 వేల మందికి ఈ వైరస్ సోకగా, నేడు మరో 1,500 మందికి పైగా ప్రజలు ఇవే లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. వీరంతా కరోనా వ్యాధి లక్షణాలతోనే కనిపించడంతో, వైద్యులు వీరిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. వచ్చే పది రోజుల్లో మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని, వెంటనే ఈ వ్యాధికి ఔషధాన్ని తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య వర్గాలు అభిప్రాయపడ్డాయి.