YS Vivekananda Reddy: సీబీఐ విచారణ కోరడానికి కారణాలివే: పిటిషన్ లో వైయస్ వివేకా కూతురు

  • హత్య జరిగి 10 నెలలు అవుతున్నా విచారణలో పురోగతి లేదు
  • సిట్ ను మూడు సార్లు ఎందుకు మార్చారు?
  • వాచ్ మెన్ ఉండగానే హంతకులు ఇంట్లోకి ఎలా వచ్చారు?

మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసును సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. విచారణ ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ నేపథ్యంలో, ఈ కేసును సీబీఐ చేత విచారణ జరపించాలని కోరుతూ వివేకా కూతురు సునీత, అల్లుడు ఎన్.రాజశేఖరరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. తాము సీబీఐ విచారణను కోరడానికి గల కారణాలను వారు పిటిషన్ లో వివరించారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

వాచ్ మెన్ రంగన్న ఇంటిని చూసుకోకుండా రాత్రంతా ఎలా నిద్రపోయాడు? హత్య గురించి తనకు తెలియదని రంగన్న అంటున్నాడు. ఆ రోజు రాత్రి ఏమైనా అరుపులు విన్నారా? అనే విషయాన్ని రంగన్న వెల్లడించలేదు. పి.రాజశేఖర్ అనే వ్యక్తి ఎప్పుడు వస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు 2019 మార్చి 14న తాను ఫోన్ చేసిన విషయాన్ని రంగన్న నిరాకరిస్తున్నాడు. పోలీసులు ఈ విషయాన్ని ఇంత వరకు తేల్చలేకపోయారు.

వివేకా తల, శరీరంపై లోతైన గాయాలను, వాటి సంఖ్యను గమనిస్తే... ఈ దాడిలో ఒకరి కంటే ఎక్కువ మంది పాల్గొన్నట్టు కనిపిస్తోంది. తనపై జరిగిన దాడిని వివేకా అడ్డుకున్నట్టు అర్థమవుతోంది. వాచ్ మెన్ రంగన్న ఉండగానే నేరస్థులు ఇంట్లోకి ఎలా వెళ్లారు? రంగన్నకు తెలియకుండా పక్క ద్వారం గుండా ఎలా తప్పించుకున్నారు?

వివేకా డెడ్ బాడీకి ఉన్న గాయాలను షేక్ ఇనయతుల్లా తీసిన ఫొటోలు, వీడియోలు తమ దృష్టికి వచ్చేంత వరకు... ఆయన గుండెపోటుతోనే మృతి చెందారంటూ మీడియాలో ఎలా ప్రసారమైంది? హత్య జరిగిన మరుసటి రోజు ఉదయం 8.30-9.30 మధ్యలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకు ముందే సీఐ ఘటనాస్థలికి వెళ్లి వివేకా ఒంటిపై ఉన్న గాయాలను చూశారు. అయినా అనుమానాస్పద మృతిగా కేసును ఎలా నమోదు చేస్తారు? ఘటనను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక ఎవరున్నారు?

కడప వైసీపీ ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి, వైయస్ భాస్కరరెడ్డిల అనుచరుడు డాక్టర్ శివశంకర్ రెడ్డి వివేకా మృతదేహం ఉన్న పడకగదిలో ఎందుకున్నారు? గాయాలను శుభ్రపరిచి, కట్టు వేయాలని ఎందుకు హడావుడి చేశారు? పడకగది, బాత్ రూమ్ లో ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేయాలని వంటమనిషి లక్ష్మమ్మను ఎర్ర గంగిరెడ్డి ఎందుకు ఆదేశించారు?

మృతదేహాన్ని బాత్ రూమ్ నుంచి పడకగదిలోకి మార్చడం... తలపై ఉన్న గాయాలకు కట్టు కట్టడం వంటివి జరిగిన సమయంలో వైద్యులు, కుటుంబసభ్యులు ఉన్నప్పుడు... సాక్ష్యాధారాలను చెరిపేశారన్న అభియోగాలను వారిపై ఎందుకు మోపలేదు? విచారణ జరుపుతున్న సిట్ ను మూడు సార్లు ఎందుకు మార్చారు? గతంలో సిట్ అధిపతిగా అడిషనల్ డీజీ స్థాయి అధికారి ఉండగా... ఆ స్థానంలో ఎస్పీ స్థాయి అధికారిని ఎందుకు పెట్టారు?

హత్య జరిగి 10 నెలలు అవుతోంది... దర్యాప్తులో పురోగతి గురించి ఇంతవరకు పోలీసులు ఎందుకు మాట్లాడటం లేదు? హత్యలో ప్రధాన అనుమానితుడైన వైసీపీ నేత పరమేశ్వరరెడ్డి... హత్య జరిగిన తర్వాత ఉదయం ఆసుపత్రిలో చేరి ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఎందుకు కలిశారు?

ఇలా పలు అనుమానాలను సునీత తన పిటిషన్ లో వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో విచారణ సవ్యంగా జరగాలన్నా, వాస్తవాలు వెలుగులోకి రావాలన్నా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో, హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

  • Loading...

More Telugu News