Arvind Kejriwal: నేను బతకనని అప్పట్లో డాక్టర్లు చెప్పారు.. అయినా పట్టించుకోలేదు: కేజ్రీవాల్

  • దేశం కోసం నా జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నా
  • నా గురించి, నా కుటుంబం గురించి కూడా పట్టించుకోలేదు
  • అలాంటి నేను ఉగ్రవాదిని ఎలా అయ్యాను?

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తనను టెర్రరిస్ట్ అన్న బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈరోజు మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఆపన్నుల కోసం తాను ఎంతో చేశానని.... తన గురించి, తన కుటుంబం గురించి కూడా పట్టించుకోలేదని... దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని... అలాంటి తాను ఉగ్రవాదిని ఎలా అయ్యానని ప్రశ్నించారు.

తాను ఒక డయాబెటిక్ పేషెంట్ నని, రోజుకు నాలుగు సార్లు ఇన్సులిన్ తీసుకుంటానని కేజ్రీవాల్ చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లవద్దని తనకు డాక్టర్లు గతంలో చెప్పారని... వెళితే నీవు బతకడం కూడా కష్టమేనని డాక్టర్లు చెప్పారని... అయినా ప్రజల కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తన స్నేహితులు ఎంతో మంది విదేశాల్లో ఉంటున్నారని... తాను కూడా వెళ్లాలనుకుంటే విదేశాలకు వెళ్లి ఉండేవాడినని చెప్పారు. తాను తన ఉద్యోగాన్నే వదిలేశానని... ఏ ఉగ్రవాదైనా ఇలా చేస్తాడా? అని ప్రశ్నించారు. తాను వారి కుమారుడినో, లేక వారి సోదరుడినో లేక టెర్రరిస్టునో అనేదాన్ని ఢిల్లీ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా పర్వేశ్ వర్మ ప్రసంగిస్తూ, హిందూ అమ్మాయిలను ముస్లిం వ్యక్తులు ఎత్తుకొని పోతున్నారనే వార్తలను మనం వింటున్నామని... కేజ్రీవాల్ వంటి ఉగ్రవాదులు ఇలాంటి ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనమంతా కశ్మీర్ లోని ఉగ్రవాదులపై పోరాడుదామా? లేక కేజ్రీవాల్ వంటి ఉగ్రవాదులతో పోరాడుదామా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News