Uttar Pradesh: యూపీలో 11 గంటల ఎన్ కౌంటర్... పిల్లలను బంధించిన దుండగుడి కాల్చివేత... పిల్లలంతా క్షేమం!
- పుట్టిన రోజు పేరిట పిల్లలను పిలిచి బందీచేసిన వైనం
- పోలీసులపైకి గ్రనేడ్లు విసరడంతో పరిస్థితి విషమం
- తెల్లవారుజామున నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు
తన కుమార్తె పుట్టినరోజు పార్టీ ఉందని చెప్పి, 23 మంది పిల్లలను బంధించిన నేరగాడు సుభాష్ బాథమ్ ను 11 గంటల ఎన్ కౌంటర్ అనంతరం పోలీసులు కాల్చి చంపారు. యూపీలోని ఫరూకాబాద్ జిల్లా, మహ్మదాబాద్ సమీపంలోని కార్తియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సుభాష్ ను కాల్చిచంపిన స్నిప్పర్స్, పిల్లలందరినీ క్షేమంగా బయటకు తీసుకుని వచ్చారు.
అంతకుముందు ఆ ప్రాంతంలో హై డ్రామా నడిచింది. పిల్లలను బందీలుగా పెట్టుకున్న సుభాష్, వారికి తుపాకీ గురిపెట్టి చంపేస్తానని హెచ్చరించాడు. గాల్లోకి కాల్పులు జరిపాడు. పిల్లలను రక్షించడం కోసం ఇంట్లోకి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా, గ్రనేడ్లు విసిరాడు. దీంతో ఇద్దరు పోలీసులు, గ్రామస్థులకు గాయాలు అయ్యాయి. ఆపై వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు, రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఆపరేషన్ కొనసాగించాలని నిర్ణయించారు. తెల్లవారుజామున నిందితుడు కాస్తంత ఆదమరచివున్న సమయంలో ఆపరేషన్ పూర్తి చేశారు.
కాగా, గతంలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో సుభాష్ కు జీవిత ఖైదు పడగా, ప్రస్తుతం పెరోల్ మీద బయటకు వచ్చాడు. యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులతో పాటు, స్పెషల్ ఆపరేషన్ కమాండోల సాయంతో పిల్లలను కాపాడామని రాష్ట్ర అడిషనల్ డీజీపీ పీవీ రామశాస్త్రి వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడి భార్యకు గాయాలు కాగా, ఆమెను ఆసుపత్రికి తరలించామని తెలిపారు.