Balakrishna: వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నందమూరి బాలకృష్ణ
- గతంలో రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించారు
- ఇప్పుడు మాత్రం ప్రజల్లో చీలికలు తెస్తున్నారు
- శాసన, కార్యనిర్వాహక శాఖలు ఎక్కడైనా ఒకచోటే ఉండాలి
- ఒక వెలుగు వెలిగిన తెలుగు చరిత్ర ఇప్పుడెక్కడికి పోతోంది?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. గతంలో రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించారని, ఇప్పుడు మాత్రం ప్రజల్లో చీలికలు తెస్తున్నారని అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాల స్థాయికి చేరుకోవాలంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి దీటుగా ఏపీలో గొప్పగా రాజధానిని నిర్మించుకోవాలన్నారు.
శాసన, కార్యనిర్వాహక శాఖలు ఎక్కడైనా ఒకచోటే ఉండాలని చెప్పారు. కర్నూలు నుంచి విశాఖ వెళ్లాలంటే చాలా దూరమవుతుందని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కియా అనుబంధ సంస్థలు వెనక్కి వెళుతున్నాయని విమర్శించారు. నిన్న తన నియోజక వర్గం హిందూపురంలో వైసీపీ కార్యకర్తలే తన కాన్వాయ్‌ను అడ్డుకుని కొత్త సంస్కృతికి తెరలేపారన్నారు. వైసీపీ నిర్ణయాలు సరికాదని చెప్పారు. ఒక వెలుగు వెలిగిన తెలుగు చరిత్ర ఇప్పుడెక్కడికి పోతోందని ప్రశ్నిస్తూ... ప్రజల నుంచి విప్లవం వస్తుందని హెచ్చరించారు.