Telugudesam: ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతాం.. అమరావతిని కాపాడుకుంటాం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
- మండలి రద్దుపై తీర్మానం చేసినంత మాత్రాన మా పోరాటం ఆగదు
- వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా, పాలనాపరంగా విఫలం
- ‘ఆరోగ్యశ్రీ’ రద్దు చేయాలన్న నిర్ణయం కరెక్టు కాదు
ఏపీ శాసనమండలి రద్దుపై తీర్మానం చేసినంత మాత్రాన తమ పోరాటం ఆగదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు. ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతామని, అమరావతిని కాపాడుకుంటామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా, పాలనాపరంగా విఫలమైందని, ఏలూరు ఆస్పత్రిలో మృతదేహం కళ్లను ఎలుకలు తినేసిన ఘటనే ఇందుకు నిదర్శనమని అన్నారు. వైద్య రంగంపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని, ఈ ఘటనకు సీఎం జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, ఆళ్ల నాని బాధ్యత వహించాలని, తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ‘ఆరోగ్యశ్రీ’ రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపైనా అశోక్ బాబు విమర్శలు చేశారు. ఈ నిర్ణయం సరికాదని, ‘ఆరోగ్య శ్రీ’ స్థానంలో బీమా పథకంతో పేద రోగులకు న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఏపీ ఆర్థిక వ్యవస్థ డొల్లతనం బయటపడుతుందని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.