CoronaVirus: కరోనా మహమ్మారిపై పోరాటానికి వందల కోట్ల విరాళాలు ప్రకటిస్తున్న చైనా కుబేరులు
- చైనాలో గజగజలాడిస్తున్న కరోనా వైరస్
- ఇతర దేశాలకు సైతం పాకిన ప్రాణాంతక వైరస్
- రూ.103 కోట్లు విరాళం ప్రకటించిన జాక్ మా
- రూ.309 కోట్లు ఇస్తున్న టెన్సెట్ హోల్డింగ్స్ అధినేత
కరోనా వైరస్ ఇప్పుడు చైనాను దాటి అనేక దేశాలకు పాకింది. బ్రిటన్, భారత్ లోనూ కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ ప్రాణాంతక వైరస్ ను కట్టడి చేసేందుకు చైనా సర్వశక్తులు ఒడ్డుతోంది. కరోనా వైరస్ కు మందు కనిపెట్టేందుకు కోట్లు కుమ్మరిస్తోంది. ఈ క్రమంలో చైనా అపర కుబేరుడు, ప్రఖ్యాత అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా భారీ విరాళం ప్రకటించారు. కరోనా వైరస్ పై పోరాటానికి ఆయన రూ.103 కోట్లు అందించారు.
జాక్ మానే కాకుండా, చైనాలో పేరొందిన వ్యాపారవేత్తలు వందల కోట్లలో విరాళాలు ప్రకటిస్తూ కరోనా ముప్పు నుంచి చైనాను రక్షించుకునేందుకు తమవంతు తోడ్పాటునందిస్తున్నారు. టెన్సెంట్ హోల్డింగ్స్ అధినేత పోనీ మా రూ.309 కోట్లు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు, మ్యాపింగ్, డేటా సర్వీసులు కూడా ఉచితంగా అందించేందుకు నిశ్చయించారు.