BJP: కేటీఆర్ ను సీఎం చేయాలన్న తపన తప్ప, అభివృద్ధి ఆలోచనే మాత్రం కేసీఆర్ లో లేదు: బీజేపీ ఎంపీ సంజయ్
- ఒకవేళ కేటీఆర్ ను సీఎం చేస్తే కేబినెట్ సహా టీఆర్ఎస్సూ ఖాళీ
- సీఏఏను టీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
- ఈ చట్టాన్ని వ్యతిరేకించే వాళ్లందరూ దేశద్రోహులే
కేటీఆర్ ను సీఎం చేయాలన్న తపన కేసీఆర్ లో బాగా కనపడుతోందని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ ను కనుక ముఖ్యమంత్రిని చేస్తే కేబినెట్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ కూడా ఖాళీ అవుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే, తాను ప్రధాన మంత్రిని అవుతానంటూ సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనే ఆయనకు లేదని ధ్వజమెత్తారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను టీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తోందో స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఏఏను ముస్లింలు వ్యతిరేకించడం లేదని, ఈ అంశాన్ని కేవలం రాజకీయ కోణంలో చూస్తున్న ప్రతిపక్ష పార్టీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. నాడు ‘గోకుల్ చాట్’ లో బాంబులు పేల్చి అనేక అమాయకుల ప్రాణాలు బలిగొన్న పాకిస్థాన్ టెర్రరిస్టులకు మన దేశంలో పౌరసత్వం ఇద్దామా? లుంబినీ పార్క్ లో బాంబులు పేల్చి అమాయకులను బలిగొన్నటువంటి వ్యక్తులకు మన దేశ పౌరసత్వం ఇద్దామా? అంటూ టీఆర్ఎస్ ను ప్రశ్నించిన ఆయన నిప్పులు చెరిగారు. ఇలాంటి వ్యక్తులకు పౌరసత్వం కల్పించాలని కోరేవాళ్లందరూ ‘దేశ ద్రోహులు’గా మిగిలిపోతారని మండిపడ్డారు.
రాబోయే రోజుల్లో ఎన్ఆర్సీనీ అమలు చేస్తాం
సీఏఏను వ్యతిరేకిస్తే ప్రజలు తిరగబడతారని, దీని విషయంలో ఎన్ని సవాళ్లైనా సరే తమ ప్రభుత్వం ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎన్ఆర్సీని కూడా అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేసిన సంజయ్, టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. టీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని, పూర్తిగా అవినీతిమయం అయిందని, ఆ పార్టీ అవినీతిని బట్టబయలు చేస్తామని, టీఆర్ఎస్ సంగతి చూస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు.