Karona virus: కరోనా కలకలం.. శవాన్ని పట్టించుకోని స్థానికులు
- చైనాలోని వుహాన్ లో వీధుల్లో శవం
- గంటలపాటు ఎవరూ పట్టించుకోని వైనం
- ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాత్రికేయుడు
కరోనా వైరస్ బయల్పడిన చైనాలోని పారిశ్రామిక నగరం వుహాన్ లో పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ ఎవరైనా మరణిస్తే.. వారిని ముట్టుకోవడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ వైరస్ కారణంగా చైనాలో ఇప్పటివరకు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క వుహాన్ లో నే 159 మంది మరణించారు. తాజాగా వుహాన్ వీధుల్లో ఓ 60 ఏళ్ల వ్యక్తి మరణించగా, అతని శవం పుట్ పాత్ పై అలాగే కొన్ని గంటలపాటు ఉండిపోయింది. ఎవ్వరూ సమీపంలోకి కూడా వెళ్లలేదు.
చివరికి పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాన్ని అస్పత్రికి తరలించారు. అంతకుముందు ఆ శవాన్ని ఓ పాత్రికేయుడు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అక్కడి పరిస్థితి వెలుగులోకి వచ్చింది. కాగా చనిపోయిన వ్యక్తి కరోనా వైరస్ తో మృతిచెంది ఉంటాడని స్థానిక మహిళ ఒకరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతడు ఎలా చనిపోయాడన్నది ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది. కరోనా కేసుల కారణంగా వుహాన్ లోని ఆస్పత్రుల వద్ద రద్దీ నెలకొంది. రోగులు డాక్టర్లను కలవడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతోందని సమాచారం. వుహాన్ ప్రజలు నగరం వీడి ఇతర ప్రదేశాలకు వెళ్లకుండా.. అదేవిధంగా బయటి వ్యక్తులు నగరంలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.