Nirmala Sitharaman: వంద విమానాశ్రయాలకు మహర్దశ... రైల్వే వ్యవస్థ ఆధునికీకరణ: నిర్మలాసీతారామన్
- కేంద్ర బడ్జెట్‌లో రవాణా రంగానికి పెద్దపీట
- మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.7 లక్షల కోట్లు కేటాయింపు
- రైల్వే ట్రాక్ పక్కన సోలార్ విద్యుత్ కేంద్రాలు
కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌లో రవాణా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా విమానాశ్రయాల అభివృద్ధితోపాటు రైల్వే వ్యవస్థల ఆధునికీకరణ, సదుపాయాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్షా డెబ్బయి వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఉడాన్ పథకంలో భాగంగా 2024 నాటికి దేశంలోని మరో వంద విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.
బెంగళూరులో 18,600 కోట్లతో నిర్మించ తలపెట్టిన మెట్రో తరహా సబర్బన్ రైలు ఏర్పాటుకు కేంద్రం 20 శాతం నిధుల సాయం అందిస్తుందని ప్రకటించారు. ముంబయి-అహ్మాదాబాద్ మధ్య నడపనున్న హైస్పీడ్ రైళ్లను మరికొన్ని ముఖ్యకేంద్రాల మధ్య నడపనున్నట్లు ప్రకటించారు.
చెన్నై- బెంగళూరు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ వే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాన పర్యాటక కేంద్రాలను కలుపుతూ తేజస్ లాంటి రైళ్లను ఏర్పాటు చేస్తామని, రైలు మార్గాలకు ఇరువైపులా వీలున్న చోట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.