Agricultural produces: బడ్జెట్ లో కొత్త పథకం ‘కృషి ఉడాన్’.. ప్రత్యేక విమానాల్లో కూరగాయలు, పండ్లు, పూల రవాణా!
- వ్యవసాయ ఉత్పత్తులకు విలువ కల్పించేందుకే ఈ పథకం
- జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో అమలు
- పాలు, మాంసం, చేపల రవాణాకోసం ‘కిసాన్ రైల్’ పథకం
కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పథకాలను ప్రకటించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత నిస్తూ.. కృషి ఉడాన్, కిసాన్ రైల్ పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు, పూలు.. ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ‘కృషి ఉడాన్’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకంలో భాగంగా కూరగాయలు, పండ్లు, పూల ఎగుమతుల్లో రవాణాకోసం ప్రత్యేక విమానాలను ఉపయోగించనున్నట్లు వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన జిల్లాల్లోని వ్యవసాయ ఉత్పత్తులకు విలువ కల్పించే దిశగా ప్రభుత్వం ఈ పథకం తీసుకొస్తుందని మంత్రి తెలిపారు. పౌర విమానయాన శాఖ ఈ పథకాన్ని ప్రారంభించనుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
కాగా, పాలు, మాంసం, చేపల వంటి ఆహార ఉత్పత్తుల రవాణాకోసం ‘కిసాన్ రైల్’ పథకాన్ని తెస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఆహార పదార్థాల రవాణాకోసం ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైళ్లలో ప్రత్యేకంగా రిఫ్రిజిరేటెడ్ బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ పథకాలతో పాటు గ్రామాల్లో ఆహార ధాన్యాల నిల్వకోసం విలేజ్ స్టోరేజ్ పథకం, చిన్నతరహా ఎగుమతి దారులకోసం ‘నిర్విక్’ అనే పేరుతో బీమా పథకాన్ని ప్రకటించారు.