Union Budget 2020: రాష్ట్రాల అంశాల ప్రాతిపదికన కేంద్ర బడ్జెట్ ను చూడొద్దు: బీజేపీ ఎంపీ జీవీఎల్
- కశ్మీర్, లడక్ కు ఇచ్చినట్టుగానే ఏపీకి ప్యాకేజ్ ఇచ్చాం
- పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ కు సంబంధం లేదు
- అమరావతిలో ‘కల్చర్ అండ్ హెరిటేజ్’ ఏర్పాటుకు విజ్ఞప్తి చేస్తా
రాష్ట్రాల అంశాల ప్రాతిపదికన కేంద్ర బడ్జెట్ ను చూడొద్దని బీజేపీ ఎంపీ జీవీఎల్ సూచించారు. ఢిల్లీలో ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ‘ప్రత్యేక హోదా’ అంశం ముగిసిన అధ్యాయమని గతంలోనే చెప్పామని గుర్తుచేశారు. కశ్మీర్, లడక్ కు ఇచ్చినట్టుగానే ఏపీకి ప్యాకేజ్ ఇచ్చామని, నాడు అసెంబ్లీలో కూడా స్వాగతించారని ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ కు సంబంధం లేదని, ఈ ప్రాజెక్టుకు నాబార్డు నుంది కేంద్రం నిధులు ఇస్తుందని స్పష్టం చేశారు. ‘పోలవరం’ ఖర్చులకు సంబంధించి యూసీలు కేంద్రానికి అందాల్సి ఉందని అన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ సంస్థను అమరావతిలో ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానని అన్నారు.