Biryani: బిర్యానీకే పట్టం.. గూగుల్‌లో ఎక్కువ మంది వెతికింది దీని కోసమే!
- చికెన్ బిర్యానీ కోసం నెలకు 4.56 లక్షల సెర్చ్‌లు
- ఆ తర్వాతి స్థానంలో పంజాబీ స్పెషల్ బటర్ చికెన్
- ‘ఎస్ఈఎంరష్’ సంస్థ సర్వేలో వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో ఎక్కువమంది వెతికిన వంటకాల్లో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎస్ఈఎంరష్’ సంస్థ చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. చికెన్ బిర్యానీ కోసం ప్రతి నెల ఏకంగా 4.56 లక్షల మంది వెతుకుతున్నట్టు తేలింది. ఆ తర్వాతి స్థానంలో బటర్ చికెన్, సమోసా, చికెన్ టిక్కా మసాలా, దోశ, తందూరి చికెన్, పాలక్ పనీర్, నాన్, దాల్‌మఖని, చాట్ వంటి భారత వంటకాలు నిలిచాయి. వీటి గురించి కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో వెతుకుతున్నట్టు అధ్యయనంలో తేలింది.
పంజాబీ ప్రత్యేక వంటకమైన బటర్ చికెన్ కోసం 4 లక్షలసార్లు వెతికారట. సమోసా కోసం 3.9 లక్షల సెర్చ్‌లు రాగా, చికెన్ టిక్కా మసాలా కోసం నెలకు సగటున 2.5 లక్షల సెర్చ్‌లు వస్తున్నట్టు ‘ఎస్ఈఎంరష్’ తెలిపింది.