Cricket: నేడు న్యూజిలాండ్ తో భారత్ మ్యాచ్... కానీ అందరి కళ్లూ రేపటి పాకిస్థాన్ తో మ్యాచ్ పైనే!
- న్యూజిలాండ్ తో ఐదో టీ-20
- రేపు అండర్ - 19 సెమీస్
- పాక్ తో తలపడనున్న భారత్
నేడు న్యూజిలాండ్ తో భారత క్రికెట్ జట్టు ఐదో టీ-20 ఆడనున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా, ఈ మ్యాచ్ పై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదనడంలో సందేహం లేదు. ఇప్పటికే 4-0తో కివీస్ తో సీరీస్ ను గెలుచుకున్న భారత్, కేవలం క్లీన్ స్వీప్ పై కన్నేసి మాత్రమే మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ ఓడిపోయినా పెద్దగా లాభపడేదీ, నష్టపోయేదీ లేదు. దీంతో రిజర్వ్ బెంచ్ లో ఉన్న ఆటగాళ్లను ఆడించాలని భారత్ ఇప్పటికే నిర్ణయించింది.
ఇదిలావుండగా, రేపు మరో హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. భారత్, పాకిస్థాన్ జట్లు అండర్ - 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భాగంగా సెమీస్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్స్ కు చేరుతుంది. దీంతో ఈ మ్యాచ్ పైనే అందరి కళ్లూ ఉన్నాయి. ఈ పోరులో రాణించిన బ్యాట్స్ మెన్ లేదా బౌలర్ కు భారత ప్రధాన క్రికెట్ జట్టు, ఐపీఎల్ పోరుకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడంలో సందేహం లేదు.
ఈ మ్యాచ్ కి సంబంధించిన మొత్తం టికెట్లూ ఇప్పటికే అమ్ముడై పోయాయి. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఎటువంటి మ్యాచ్ అయినా అభిమానుల్లో ఎటువంటి ఒత్తిడి ఉంటుందో చెప్పనక్కర్లేదు. సీనియర్ జట్టు ఏ విధంగానైతే, ఇప్పటివరకూ పాకిస్థాన్ చేతిలో వరల్డ్ కప్ పోటీల్లో ఓటమిని ఎరుగలేదన్న సంగతి తెలిసిందే. జూనియర్ల జట్టు మాత్రం ఒకేఒక్కసారి పాక్ చేతిలో ఓడిపోయింది. ఆ రికార్డును ఈ దఫా మరింతగా పెంచుకుంటామని పాక్ అంటోంది.
ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ లో సైతం ఇండియా విజయం సాధిస్తుందని భారత క్రీడాభిమానులు నమ్మకంతో ఉండగా, రికార్డులను తిరగరాస్తామని పాక్ ఫ్యాన్స్ చెబుతున్నారు. కాగా, ఇప్పటివరకూ భారత యువ జట్టు నాలుగు సార్లు, పాక్ జట్టు ఒకసారి వరల్డ్ కప్ అండర్ - 19 కప్ ను అందుకున్నాయన్న సంగతి తెలిసిందే.