Bjp: దేశ వ్యతిరేకశక్తులు, విభజనవాదులతో కలిసి ఆప్ పరిపాలిస్తోంది: కిషన్ రెడ్డి
- ఢిల్లీలోని తెలుగు ప్రజలతో ‘ఆత్మీయ సమ్మేళనం’
- ఆప్ పోవాలని, బీజేపీ రావాలని కోరుకుంటున్నారు
- ఇక్కడి ప్రజలు ఉచిత పథకాలు కోరుకోవడం లేదు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తెలుగు ప్రజలతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆప్ పోవాలని, బీజేపీ రావాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆప్ నెరవేర్చకపోగా, కేంద్ర నిధులను ఆప్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
దేశ వ్యతిరేకశక్తులు, విభజనవాదులతో కలిసి ఆప్ పరిపాలిస్తోందని. షాహీన్ బాగ్ లో ఆప్ అధినేత కేజ్రీవాల్ ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలు ఉచిత పథకాలు కోరుకోవడం లేదని, మౌలిక వసతులు, ఇళ్లు, కాలుష్య రహిత ఢిల్లీని కోరుతున్నారని అభిప్రాయపడ్డారు. ఆప్ ను గెలిపించాలన్న కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.