Pakistan: పాకిస్థాన్ నుంచి భారత్ వైపు దూసుకొస్తున్న కొత్త శత్రువులు!
- పాక్ లో రాకాసి మిడతల బీభత్సం
- సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశిస్తున్న మిడతల దండు
- బెంబేలెత్తుతున్న పంజాబ్, రాజస్థాన్ రైతులు
పాకిస్థాన్ నుంచి భారత్ కు పొంచి ఉన్న ముప్పు ఉగ్రవాద రూపంలోనే అన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు పొరుగుదేశం నుంచి కొత్త ప్రమాదం భారత్ వైపు తరుముకొస్తోంది. పాకిస్థాన్ రైతులను హడలెత్తిస్తున్న రాకాసి మిడతలు ఇప్పుడు సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాయి. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంటపొలాలపై దాడి చేస్తూ చేతికొచ్చిన పంటను కత్తిరించి వేస్తున్నాయి. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి ఇవి భారత్ భూభాగంలో ప్రవేశిస్తున్నట్టు గుర్తించారు. పాకిస్థాన్ లో ఇప్పటికే మిడతలపై ఎమర్జెన్సీ ప్రకటించారు. రాజస్థాన్ లోని 12 జిల్లాలపై ఈ పాక్ మిడతల ప్రభావం ఎక్కువగా ఉంది.
గత రెండున్నర దశాబ్దాల్లో ఇంతటి విపత్తు ఎప్పుడూ రాలేదని భారత్ రైతులు వాపోతున్నారు. ఈ మిడతల దండును తరిమేందుకు రైతులు పెద్ద శబ్దంతో పాటలు పెట్టడం, ఫైర్ ట్యాంకర్ల సాయంతో కెమికల్స్ స్ర్పే చేయడం వంటి నివారణ చర్యలు పాటిస్తున్నారు. అయితే పొరుగున ఉన్న పాకిస్థాన్ కూడా సరైన నివారణ చర్యలు చేపడితేనే వీటి ముప్పు తగ్గుతుందని భారత్ రైతులు అభిప్రాయపడుతున్నారు. అటు, పాకిస్థాన్ లో సైతం పరిస్థితి ఇదేవిధంగా ఉంది. మిడతలు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తుండడంతో జాతీయ స్థాయిలో అత్యయిక స్థితి ప్రకటించాల్సి వచ్చింది.