Amarnath Reddy: నారావారిపల్లెలో వైసీపీ సభకు ఎస్వీ వర్సిటీ విద్యార్థులను తీసుకెళ్లారు: అమర్ నాథ్ రెడ్డి
- నాగార్జున వర్సిటీ విద్యార్థుల సస్పెన్షన్ ను తప్పుబట్టిన మాజీ మంత్రి
- వర్సిటీ వీసీ వైసీపీ కార్యకర్తలా వ్యవహరించాడని ఆరోపణ
- ఎస్వీ వర్సిటీ విద్యార్థులను కూడా సస్పెండ్ చేస్తారా? అని నిలదీత
అమరావతి కోసం గళం విప్పిన విద్యార్థుల సస్పెన్షన్ సరికాదని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. నాగార్జున వర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థుల సస్పెన్షన్ చర్యను ఖండిస్తున్నానని అన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలన్న విద్యార్థుల ఆకాంక్షలో తప్పేముందని ప్రశ్నించారు. వర్సిటీ ఉపకులపతి ఓ వైసీపీ కార్యకర్తలా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో విద్యార్థులు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకునే వీల్లేదని ఈ సంఘటన రుజువు చేస్తోందని అమర్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు.
నారావారిపల్లెలో జరిగిన వైసీపీ సభకు ఎస్వీ వర్సిటీ విద్యార్థులను తీసుకెళ్లారని, మరి ఆ విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేస్తారా? అని నిలదీశారు. ఏపీలో రెండు రకాల చట్టాలున్నాయా అనే విషయం ప్రభుత్వం చెప్పాలని అన్నారు. నాగార్జున వర్సిటీ విద్యార్థులకో న్యాయం, ఎస్వీ వర్సిటీ విద్యార్థులకో న్యాయమా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో 90 శాతానికి పైగా 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.