Corona Virus: పాక్ లో ముస్లింల పరిస్థితి అంతే: అద్నాన్ సమీ
- కరోనా వైరస్ నేపథ్యంలో చైనా నుంచి భారతీయుల తరలింపు
- పాకిస్థాన్ సిగ్గుపడాలన్న సమీ
- ముస్లింలను ఓ పనికిరాని చెత్త కింద విసిరేశారని ఆగ్రహం
భారత్, పాకిస్థాన్ దేశాల స్వభావాల మధ్య అంతరం ఎలాంటిదో కరోనా వైరస్ కూడా చాటిచెప్పింది. చైనా నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం హుటాహుటీన స్పందించి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. రెండు విమానాల్లో భారతీయులను చైనా నుంచి స్వదేశానికి తరలించారు. పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం భిన్నంగా స్పందించింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తమ వాళ్లు చైనాలోనే ఉంటే మేలని, తమకంటే చైనా వాళ్లే బాగా చూసుకుంటారని పాక్ ప్రభుత్వ పెద్దలు సెలవిచ్చారు.
దీనిపై ఓ పాక్ విద్యార్థి ట్విట్టర్ లో స్పందిస్తూ, చైనాలో చిక్కుకున్న తన పౌరులను భారత్ ఎలా కాపాడుకుంటోందో చూడండి అంటూ ఓ వీడియో పోస్టు చేశాడు. దీనిపై ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ స్పందించారు. తమ జీవితాంతం ముస్లింలు భారత్ కు విధేయులై ఉండాలని పేర్కొన్నారు. "ముస్లింలను పాకిస్థాన్ గవర్నమెంట్ ఓ పనికిరాని చెత్త కింద విసిరేసింది, అంతకంటే గొప్ప మర్యాద పాకిస్థానీ ముస్లింలకు ఎలా లభిస్తుంది?" అంటూ ట్వీట్ చేశారు. ఇది సిగ్గు పడాల్సిన విషయం అని పేర్కొన్నారు.