Gujarat: ఆమె పాడిన జానపద పాటకు పరవశించిపోయి నోట్ల వర్షం కురిపించిన ప్రేక్షకులు
- గుజరాత్ లో ఘటన
- రోమాలు నిక్కబొడుచుకునేలా గీత రబారీ పాట
- మొత్తం రూ.10 లక్షలు కుమ్మరించిన జనం
జానపద గేయాలు వింటే కొందరికి ఒళ్లు పులకరిస్తుంది.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. జానపద గేయాలు వారిని అంతగా ఆకట్టుకుంటాయి. ఆ పాటలు పాడుతున్న వారి పట్ల అభిమానం ఉప్పొంగుతుంది. గుజరాత్ లోని చిస్లీ ప్రాంతానికి సమీపంలో ఉన్న వన్జనా గ్రామంలోని ఓ మందిరం వద్ద జానపదగేయం పాడుతోన్న ఓ ప్రజా గాయనిపై అభిమానం చాటుతూ కొందరు కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు.
ఆ గాయని ఎవరో కాదు.. ప్రధాని మోదీతో కూడా శభాష్ అనిపించుకున్న గుజరాత్ కచ్ జిల్లాలోని తప్పర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నివసించే మాల్దారి తెగకు చెందిన అమ్మాయి గీత రబారీ. ‘భజన సంధ్య’ పేరిట రాజేశ్వరి మెల్దీ మేటా సేవా సమితి నిర్వహించిన ఈ కార్యక్రమానికి వందలాది మంది తరలివచ్చారు. వారిలో ప్రవాస భారతీయులు కూడా కొందరు ఉన్నారు.
రూ.100 నుంచి రూ.2000 నోట్లను వారిపై కుమ్మరించారు. వాటిల్లో అమెరికా కరెన్సీ కూడా ఉండడం గమనార్హం. దాదాపు రూ.10 లక్షల వరకు వచ్చాయి. అయితే, ఈ డబ్బునంతా మందిర అభివృద్ధికే ఇస్తామని ఆమె చెప్పారు. గీత భజనలు, జానపద గీతాలు పాడుతూ పల్లె జనులను అలరిస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఆమె ప్రధాని మోదీని కూడా కలిశారు.